Saturday, October 25, 2025

Fake Account

 శీర్షిక:Fake Account


మనిషి మాయమైతుండు

మాయ లాంటి ఆత్మోక్కటి

నిజమవుతుందంటే

మీరు నమ్ముతారా...?


ఇప్పుడు మనిషి Profile లో 'మనిషి' తనమే 

చస్తుందంటే మీరు నమ్ముతారా...?


Social media ఖాతాలే

మనిషి ఆత్మలయ్యాయి..

మనిషి కదలికే Internet తో అంటే

మీరు జీర్ణించుకొని నమ్మండి

లేదంటే మిమ్మల్ని నేను unfollow చేస్తా.


ఇంట్ల బంధాల్ని విడిచి Social Media లోనే 

నీవు నేను కాలమేల్లదిస్తున్నాం..

ఇప్పుడైనా నమ్ముతారా? నమ్మలేదు అనుకో 

మీ Post కి likes కొట్టను చూడండి!


కాలం మారుతుందా? మనిషి మారుతుండా!

రక్తం కారిన చోటికి సహాయం, ఓదార్పు 

Text లో అందుతుందేమి?రేపు మనకు మరి?


Lkg పిల్లల ఏడుపులకూ

గోరుముద్దలు,చందమామ కథలు ఏమయ్యాయి...

పోని పండు ముసలి దావకానలో ఉంటే 

ఒక టెంకాయనో, బ్రెడ్ ప్యాకెట్ ఇచ్చి

మాట్లాడే మాటలేవి‌‌...?నేనున్నా అనే స్పర్శాను

ఏ 5G,6G రాకాసి కాలాలు ఏత్తుకెళ్లాయి?


బ్రతికే స్తోమత లేక దేశం పోయినవారి

కథల్లో నెలకొక ఉత్తరం ఇరువైపుల

కన్నీళ్లను కార్చేది బాధ్యతను పెంచేది.


ఇప్పుడు పక్క గది నుంచి 

మాటకు బదులు message అందుతుందనుకుంటా?

హా! మీరు నమ్మేశారు Msg చేసుకుందాం.


ఈ Digital అక్షరాస్యులు 

ఒక Account నుండి మరో account కి మారగలరూ...నిమిషానికో భావోద్వేగం

క్షణాల...సమయం, చేతులే ఆయుధాలు.


మరి

తాపీ పట్టిన నాన్న

గట్లు చెక్కే నాన్న

కొలిమి పెట్టే నాన్న

కుండ చేసే నాన్న

ఇలా నాన్నలందరూ కాలాలు మారిన పని ఒక్కటే 

చేతి వేళ్లకు చిల్లులు పడడమే....

నాన్నా...

message లకు ఏలా 

సమాధానం ఇవ్వాలి?


మరి

కంకి కోసే అమ్మలు

రోడ్లు ఊడ్చే అమ్మలు

కూరగాయలు అమ్మే అమ్మలు

ఇలా అమ్మలకు కష్టంలో చేతులు బొబ్బలేకోచ్చు

ఇంట్లోనే social media దేశంలో ఉన్న 

తన పిల్లలకు అమ్మ కష్టం ఎలా చెప్పుకోవాలి?

పోని అరిచి అరిచి చెంబెడు నీళ్లు తెమ్మనిచెప్తే వినపడుతుందా?


ఏ Reel లోనో

'అమ్మ మీద తలవాల్చి నిద్రిస్తున్న బిడ్డ'

బోలెడన్ని likes, Mentions...


పక్క గదిలో ఉన్న అమ్మను అడిగామా

"అమ్మా తిన్నావావే" అని


అయ్యో  ఎవరైనా ఉన్నారా?

నాన్నకు అమ్మకు బోలెడన్ని Fake Accounts

వద్దు గాని ఒక Account create చేసి ఇవ్వాలి.

వాళ్ళు‌ ఒంటరి తనాన్ని మోయలేక

 Mood off, miss you లాంటివి 

status ,storys పెట్టుకుంటారేమో?


పోని 

మనలో ఎవరైనా మన Phone lock

అవ్వలకు తాతలకు నేర్పిద్దామా...

మన Phone లో వాళ్ళవి ఒక్క ఫోటో 

అయినా చూసి మురిసిపోతారు.


ఎందుకూ? ఈ online fake బ్రతుకులు?

మనిషికి మనిషికి దూరం పెరిగితే

చివరికి చావు సమయంలో ఎవరు ఉంటారు?

"Rest in peace" status తప్పా!


దండు వెంకట్ రాములు,

06/01/2024,

నల్లపూసల కింద

 నల్లపూసల కింద /దండు వెంకట్రాములు 

---------------

ఉన్నోడికైనా లేనోడికైనా 

పుస్తేలంటే నల్లపూసలే.


ముత్తయిదు తనానికి సమాజం 

గీసుకున్న గీత 'అమ్మ పుస్తే'.


ఏడాది కోసారైనా 

నల్లపూసల కింద దారం 

సెమ్ట కోతకో, సంసారం శాతకో

నలిగి నలిగి తెగిపోతుంది.


ఎదుర్కోల్లనాడు బుక్కగూలాల కింద 

అందరి నవ్వుల మధ్య తానొక్కతే ఏడుస్తూ 

హనుమాన్లగుడి కాడ ఆరిపోని దీపమై 

ఏ ఇంటి నుండో ఈ ఇంటికి

 పోలుముంతైయోచ్చింది.


ఉండి లేని సంసారంలొకొచ్చి

కష్టాన్ని కొంగు కింద దాపెట్టుకొని 

పెద్ద దర్వాజకు పసుపు రంగయి నిలిచింది. 


కట్నం కింద పెద్ద సైకిల్, ఇనుప పెట్టే తేలేదని 

అత్తింట్లో గోసాల పడ్డ గాని ఆ ముచ్చట

తల్లి ఇంటికి ముచ్చట ఎరకగానియ్యకుండా 

ఎదల దాచుకున్న కథలన్నీ ఎదమీదున్న నల్లపూసలే.

అపి...

ఆడోళ్ళ నోట్లో మాట దాగదనే మాటను 

ఈ నల్లపూసలే అబద్ధం చేసినయ్.


పౌ షేరు సార తాగొచ్చి ఊరు మీది కోపాన్ని 

తోలు చెప్పులిర్గ ,గొడలి కామలిర్గ

పెళ్ళాం మీద పౌరుషాన్ని చూపిస్కున్న 

మొగుడి కింద అణిగి మనిగినవి

ఈ నల్లపూసలే.


ఇంట్ల ఎవరికైనా పానం బాలేకపోతే 

ఈ నల్లపూసలు తెగి పుస్తెలు కుదబడ్డాయి.


పిల్లలు గాక మన్యంకొండ గుట్టకో, కురుమూర్తి గుట్టకో

పొర్లు దండాలు వెట్టి, అనరాని పత్యాలు చేసింది

గొడ్రాలి తనం రాకూడదని అడిగోసలు పడ్డది 

ఈ నల్లపూసల భయంకే గదూ!


ఎల్లని సంసారంకి తీరని అప్పులు ఉంటే 

బొంబాయిలో లక మీద పనికి పోయి

కారంపొడి మెతుకులై పిల్లల చదువులకు అక్షరాలను పేర్చింది నల్లపూసలే.


అత్తమామల కింద,తోటి యారండ్ల కింద 

సంసారం సాలు సాలై ఎరైనప్పుడు

తన బతుకు సాళ్లకు ఇత్తేసి నీళ్లు పెట్టుకున్నది

నల్లపూసల కింది మనిషే.


బాయ్ నీళ్ల కాడ ఒక గుడ్డం ఒడ్లు వండనీక్కే

పాలొండ్లతో పాలుకు నిలిచి తన్నులు తిని 

తన పిల్లలకై 'జోడిఎద్దుల ఎత్తు' పంట

వండించుకున్నది మళ్ళీ నల్లపూసల కింది మనిషే.


ఇంగో..పుస్తెను గట్టిన 

 నాయ్నకే తెల్వకుండా కొన్ని మార్ల,

తెల్సె కొన్ని మార్ల....

 పొయ్యి కింద కమిలిన పొయ్యి మోకిరే తీర్గ....

ఈ నల్లపూసల కింద ఓ మన్సి నలిగిపోయుంటుంది.


చివర్కి..

కూరలో ఉప్పు లేదనో,కారం లేదనో,మొగోళ్ళ దెబ్బలకు

తెగి పడ్డ పుస్తేలేక్కనే తాను ఎన్ని ముక్కలైందో..

ఓపికతో పూసలన్నేరి ధారంకూ గుచ్చుకున్న తాను

"ఓ ఎల్లమ్మ తల్లే".


ఇట్లా తీరు తీరు నల్ల పూసల కథలు


నిజంగా మాట్లాడాలంటే

నల్లపూసల కింద దారాలు ఎక్కడివి 

మనుషులే ఉన్నారు జీవితాలే నలిగాయి


అవ్వలు,అమ్మలై నిలిచారు.

Fake Account

  శీర్షిక:Fake Account మనిషి మాయమైతుండు మాయ లాంటి ఆత్మోక్కటి నిజమవుతుందంటే మీరు నమ్ముతారా...? ఇప్పుడు మనిషి Profile లో 'మనిషి' తనమే ...