Saturday, October 25, 2025

నల్లపూసల కింద

 నల్లపూసల కింద /దండు వెంకట్రాములు 

---------------

ఉన్నోడికైనా లేనోడికైనా 

పుస్తేలంటే నల్లపూసలే.


ముత్తయిదు తనానికి సమాజం 

గీసుకున్న గీత 'అమ్మ పుస్తే'.


ఏడాది కోసారైనా 

నల్లపూసల కింద దారం 

సెమ్ట కోతకో, సంసారం శాతకో

నలిగి నలిగి తెగిపోతుంది.


ఎదుర్కోల్లనాడు బుక్కగూలాల కింద 

అందరి నవ్వుల మధ్య తానొక్కతే ఏడుస్తూ 

హనుమాన్లగుడి కాడ ఆరిపోని దీపమై 

ఏ ఇంటి నుండో ఈ ఇంటికి

 పోలుముంతైయోచ్చింది.


ఉండి లేని సంసారంలొకొచ్చి

కష్టాన్ని కొంగు కింద దాపెట్టుకొని 

పెద్ద దర్వాజకు పసుపు రంగయి నిలిచింది. 


కట్నం కింద పెద్ద సైకిల్, ఇనుప పెట్టే తేలేదని 

అత్తింట్లో గోసాల పడ్డ గాని ఆ ముచ్చట

తల్లి ఇంటికి ముచ్చట ఎరకగానియ్యకుండా 

ఎదల దాచుకున్న కథలన్నీ ఎదమీదున్న నల్లపూసలే.

అపి...

ఆడోళ్ళ నోట్లో మాట దాగదనే మాటను 

ఈ నల్లపూసలే అబద్ధం చేసినయ్.


పౌ షేరు సార తాగొచ్చి ఊరు మీది కోపాన్ని 

తోలు చెప్పులిర్గ ,గొడలి కామలిర్గ

పెళ్ళాం మీద పౌరుషాన్ని చూపిస్కున్న 

మొగుడి కింద అణిగి మనిగినవి

ఈ నల్లపూసలే.


ఇంట్ల ఎవరికైనా పానం బాలేకపోతే 

ఈ నల్లపూసలు తెగి పుస్తెలు కుదబడ్డాయి.


పిల్లలు గాక మన్యంకొండ గుట్టకో, కురుమూర్తి గుట్టకో

పొర్లు దండాలు వెట్టి, అనరాని పత్యాలు చేసింది

గొడ్రాలి తనం రాకూడదని అడిగోసలు పడ్డది 

ఈ నల్లపూసల భయంకే గదూ!


ఎల్లని సంసారంకి తీరని అప్పులు ఉంటే 

బొంబాయిలో లక మీద పనికి పోయి

కారంపొడి మెతుకులై పిల్లల చదువులకు అక్షరాలను పేర్చింది నల్లపూసలే.


అత్తమామల కింద,తోటి యారండ్ల కింద 

సంసారం సాలు సాలై ఎరైనప్పుడు

తన బతుకు సాళ్లకు ఇత్తేసి నీళ్లు పెట్టుకున్నది

నల్లపూసల కింది మనిషే.


బాయ్ నీళ్ల కాడ ఒక గుడ్డం ఒడ్లు వండనీక్కే

పాలొండ్లతో పాలుకు నిలిచి తన్నులు తిని 

తన పిల్లలకై 'జోడిఎద్దుల ఎత్తు' పంట

వండించుకున్నది మళ్ళీ నల్లపూసల కింది మనిషే.


ఇంగో..పుస్తెను గట్టిన 

 నాయ్నకే తెల్వకుండా కొన్ని మార్ల,

తెల్సె కొన్ని మార్ల....

 పొయ్యి కింద కమిలిన పొయ్యి మోకిరే తీర్గ....

ఈ నల్లపూసల కింద ఓ మన్సి నలిగిపోయుంటుంది.


చివర్కి..

కూరలో ఉప్పు లేదనో,కారం లేదనో,మొగోళ్ళ దెబ్బలకు

తెగి పడ్డ పుస్తేలేక్కనే తాను ఎన్ని ముక్కలైందో..

ఓపికతో పూసలన్నేరి ధారంకూ గుచ్చుకున్న తాను

"ఓ ఎల్లమ్మ తల్లే".


ఇట్లా తీరు తీరు నల్ల పూసల కథలు


నిజంగా మాట్లాడాలంటే

నల్లపూసల కింద దారాలు ఎక్కడివి 

మనుషులే ఉన్నారు జీవితాలే నలిగాయి


అవ్వలు,అమ్మలై నిలిచారు.

No comments:

Post a Comment

Fake Account

  శీర్షిక:Fake Account మనిషి మాయమైతుండు మాయ లాంటి ఆత్మోక్కటి నిజమవుతుందంటే మీరు నమ్ముతారా...? ఇప్పుడు మనిషి Profile లో 'మనిషి' తనమే ...